ప్రతిపక్షం, జూలై 03: కేరళలోని ఎర్నాకుళంలో ట్రాఫిక్ మధ్య గుండెపోటుతో కుప్పకూలిన 43 ఏళ్ల వ్యక్తిని ఇద్దరు నర్సులు సమయస్ఫూర్తితో కాపాడారు. బస్సులో ప్రయాణిస్తున్న నర్సులు అంజలి, ఆర్ద్ర రాజ్ బాధితుడి పరిస్థితిని గమనించి వెంటనే కిందకు దిగి అత్యవసర ప్రథమ చికిత్స అందించారు.
వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) నిర్వహించడంతో బాధితుడు కోలుకునే అవకాశం లభించింది. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా, ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.
అత్యవసర సమయంలో చాకచక్యంగా స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఈ ఇద్దరు నర్సులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వారి సేవాభావం, మానవత్వాన్ని పలువురు కొనియాడుతూ “దేవదూతల్లా వచ్చి ప్రాణాలు కాపాడారు” అంటూ అభినందిస్తున్నారు.

















