గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. రూ.117 కోట్లతో ఘాట్ల అభివృద్ధి

ప్రతిపక్షం, జూన్ 30: రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపడుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

పుష్కరాల కోసం ఏడాది ముందుగానే పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ధర్మపురి, కోటిలింగాల వంటి ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య వ్యవస్థ, విశ్రాంతి కేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.117 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

భక్తుల రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, భద్రత, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు.

పుష్కరాల నిర్వహణలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీల సహకారంతో పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో గోదావరి పుష్కరాలను దేశానికే ఆదర్శంగా నిలిచేలా నిర్వహించడమే లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News