ANR National Award 2024: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక ఏయన్నార్ జాతీయ అవార్డు దక్కింది. 2024గానూ ఈ జాతీయ అవార్డును చిరంజీవికి ఇవ్వనున్నట్టు సినీ హీరో నాగార్జున ప్రకటించారు. ఈ అవార్డును అక్టోబరు 28న పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆర్కే సినీ ప్లెక్స్‌లో నిర్వహించిన వేడుకలో నాగార్జున ప్రకటించారు.
ఏయన్నార్ నవ్వుతూ తమకు జీవిత పాఠాలు నేర్పించారని నాగార్జున అన్నారు. నాన్న పేరు తలచుకుంటే మాకు చిరునవ్వు వస్తుందని, ఆయన నటించిన చిత్రాలు మళ్లీ మీ ముందుకొస్తున్నాయన్నారు. నవంబరులో నిర్వహించనున్న ‘ఇఫి’ వేడుకలో నాన్న సినీ ప్రయాణంపై వీడియో ప్రదర్శించనున్నారు. నాన్నతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు రాజ్ కపూర్ తదితరులపైనా స్పెషల్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని చెప్పారు. అయితే ఏయన్నార్ జాతీయ అవార్డు ఇవ్వనున్నామని చిరంజీవికి చెప్పగానే ఆయన ఎమోషనల్ అయ్యారని, దీనికంటే పెద్ద అవార్డు లేదన్నారని పేర్కొన్నారు.