ప్రతిపక్షం, జూన్ 01: వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, అనారోగ్యంతో ఉన్న చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోయారని ఆరోపించారు. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యుడు ఫోన్ ద్వారా సీనియర్ డాక్టర్ సూచనలు తీసుకుని చికిత్స అందించారని, అదే చిన్నారి మృతికి కారణమైందని తల్లిదండ్రులు వాపోయారు.
చిన్నారి మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి గేటు వద్ద మృతదేహంతో ధర్నా నిర్వహించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చిన్నారి మృతికి గల కారణాలపై విచారణ చేపట్టి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

















