ప్రతిపక్షం, జూలై 13: తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 15, 16 తేదీల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, సంస్థల నామినేటెడ్ పదవుల భర్తీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
ఇప్పటికే పదవుల్లో ఉన్న వారి పనితీరు, పార్టీ కోసం చేసిన సేవలు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొందరికి పదవులు కొనసాగించే అవకాశముండగా, మరికొన్ని స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నాయకుల్లో ఈ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే అధికారికంగా సమావేశ తేదీలు, నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

















