ప్రతిపక్షం, జూలై 07: రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని నేటితో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పంపిణీ పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3.10 కోట్లకు పైగా, అంటే 91.85 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తయ్యాయని తెలిపారు. పంపిణీ పూర్తైన ఫారాలను వెంటనే డిజిటలైజ్ చేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఫారాల పంపిణీ ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో అదనపు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని సీఈఓ స్పష్టం చేశారు.
















