ప్రతిపక్షం, జూలై 06: తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ జోరందుకుంది. ఈ నెల 24 లేదా 25 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ నాటికి మూడు సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న రెండు క్యాబినెట్ బెర్త్‌లను భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్న నేతల జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాజకీయ సమతుల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే మంత్రివర్గ విస్తరణ తేదీ, కొత్త మంత్రుల ఎంపికపై ఇప్పటివరకు ప్రభుత్వం లేదా కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో తుది నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

















