[t4b-ticker]

నిజామాబాద్ జీజీహెచ్‌కు సూపర్ స్పెషాలిటీ హబ్ హోదా.. త్వరలో ఎంఆర్‌ఐ, కొత్త వైద్య సేవలు

ప్రతిపక్షం, ఆగస్టు 04: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)ను ప్రధాన రిఫరల్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. భవిష్యత్తులో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అత్యాధునిక ఎంఆర్‌ఐ యంత్రాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసి నిర్ధారణ సేవలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జీజీహెచ్, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సబ్ సెంటర్ల పనితీరు, మౌలిక వసతులు, సిబ్బంది అవసరాలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

ప్రజాప్రతినిధులు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి, జిల్లాల్లో వైద్య సేవలు బలోపేతం అయితే హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ఆస్పత్రులపై రోగుల భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. అంకాపూర్‌లో కొత్త పీహెచ్‌సీ, నందిపేట్ పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేయడం, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీర్చేందుకు ఇప్పటికే 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా నిపుణులు, 22 మంది శిశు వైద్యులు, 330 మంది నర్సింగ్ అధికారులను నియమించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకాలను పూర్తి చేసి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన సిబ్బందిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు, మందులు, మానవ వనరుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఉచిత నిర్ధారణ పరీక్షలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News