రేవంత్‌ సీఎం కావడం తెలంగాణ ప్రజల కర్మ: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ప్రతిపక్షం, జూలై 20: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల కర్మ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతికి పాల్పడి డబ్బులు దోచుకోవడం, వాటిని ఢిల్లీకి పంపడం తప్ప ముఖ్యమంత్రికి మరేమీ తెలియదని ఆరోపించారు.

రేవంత్‌రెడ్డికి తిట్లు, ఒట్లు తప్ప పాలనపై అవగాహన లేదని కేటీఆర్‌ విమర్శించారు. కరవు పరిస్థితులపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. కరవు వచ్చినందుకు పొలాల్లో రక్తం చల్లాలని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్‌ నిర్మించిన పంప్‌హౌస్‌లను ఆన్‌ చేస్తేనే గోదావరి నీటిని వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకు పరిమితమవుతోందని ఆరోపించారు.

తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్‌ మండిపడ్డారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు.

Spread the love

Related News

Latest News