Trending Now

బీఆర్​ఎస్​లో ఉక్కిరి బిక్కిరి..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: గత పదేళ్లపాటు తెలంగాణ రాజకీయాలతో పాటు పాలనను శాసించిన బీఆర్​ఎస్​ పార్టీ ఇబ్బందుల్లో అల్లాడిపోతోంది. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి గత ఏడాది డిసెంబర్​ వరకు యావత్​ దేశ రాజకీయాలనే శాసించే విధంగా ఎదిగిన బీఆర్​ఎస్​కు లోక్​సభ ఎన్నికల సమయంలో అడుగడుగున ఇబ్బందులు వెంటాడుతున్నాయి. గత పదేళ్ల పాలనలో అంతా సాఫీగా సాగిందను కొంటున్న సమయంలో ఆ పార్టీకి చెందిన సీనియర్లు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలకు చెందిన వ్యక్తులు భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ప్రతి నిత్యం వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు గులాబిబాస్​ తనయ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంబకోణంలో ఈడీ అరెస్ట్​ చేయడం, ఆమెను ఇప్పట్లో ఈ కేసు నుంచి ఈడీ వదలని పరిస్థితి నెలకొంది. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ఈడీ ధర్యాప్తులు, మరో పక్క అధికారంలో ఉన్నసమయంలో ఫోన్​ట్యాపింగ్​కేసు రోజు రోజుకు ఓ మలుపు తిరుగుతుండడం, ఈ కేసులో ఇద్దరు మంత్రులకు నేడో రేపో సిట్​ 41ఐపీసీ కింద నోటీసులు జారీ చేయాలని నిర్ణయించడంతో బీఆర్​ఎస్​ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకుని లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఓ పక్క రెడీ అవుతుంటే, కాళ్లకు బంధాలు వేసే విధంగా ఈడీ, ఫోన్​ ట్యాపింగ్​, భూ కబ్జాల కేసులతో పార్టీ నేతలు బెంబెలెత్తుతున్నారు. ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలని ఓ పక్క గులాబిబాస్​ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల్లో పార్టీని ఇబ్బందులకు గురిచేసేందుకు బీజేపీ, కాంగ్రెస్​పార్టీలు అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ ప్రజల ముందుకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. అయితే పార్టీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్​ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. దీంతో పలువురు మాజీ మంత్రుల, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సైతం తమ ఫోన్లు ట్యాపింగ్​ చేశారా..? చేసి ఉండోచ్చన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము రోజు వారీ కార్యక్రమాలతో పాటు కొన్నిసెటిల్​మెంట్లు కూడా చేశామని, ఈ విషయం ఫోన్​ ట్యాపింగ్​లో దొరికితే తమపై కూడా కేసులు నమోదు అ​వుతాయంటూభయం పుట్టుకుంది. దీనితో పాటు ట్యానిక్​ మధ్యం షాపుల అడ్డగోలు అనుమతులు, షాపుల్లో జీఎస్టీ వసూళ్లు తదితర అంశాలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రదారులు బయట పడాల్సి ఉందంటున్నారు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్​ బంధువుల హస్తం ఉన్నట్లు సమాచారం.

పోన్​ట్యాపింగ్​లో కీలక నేతలు..

ఫోన్​ట్యాపింగ్​ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినల్లు రోజు రోజుకు కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే కీలక నేతల పేర్లు సైతం బయట పడే అవకాశం ఉండడంతో ఆ పార్టీ అధినాయకత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బీఆర్​ఎస్​లో కొనసాగితే తమపై కూడా కేసులు తప్పవంటూ పలువురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. ముఖ్యంగా వీరంతా కాంగ్రెస్​పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారన్న వార్తలు గుప్పుమంటుండడంతో గులాబిబాస్​ ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరో పక్క బీఆర్​ఎస్​, బీజేపీలు ఒక్కటే అని, ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కలిసి నాటకాలకు తెరలేపారంటూ సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై కూడా పార్టీలో చర్చకు దారితీస్తున్నది. ఓ పక్క బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు నమోదు చేసి జైలుకు పంపితే మరో పక్క బీజేపీ, బీఆర్​ఎస్​ దోస్తానా అన్న ఆరోపణలు ఆ పార్టీ నిద్వంధంగా ఖండించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీని తెలంగాణలో దెబ్బకొట్టేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఎత్తుగడలో భాగంగానే కవిత ఆరెస్ట్​ చేశారన్న వార్తలు గ్రామాలకు పాకింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు..

భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల్లో ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తనయ మేయర్​ విజయలక్ష్మి, మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్​​కుమార్​తో పాటు పలువురు నేతలున్నారు. వీరితో పాటు పలువురు బీఆర్​ఎస్​ నేతలు ధరణిని ఉపయోగించుకొని సర్కారు భూమిని వేల ఎకరాలు తమ పేరున పట్టా చేస్తుకున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా గులాబి బాస్​ కేసీఆర్​ అన్న కుమారుడు కన్నారావు వేల ఎకరాల భూములను కబ్జా చేసినట్లు కాంగ్రెస్​ ప్రభుత్వం గుర్తించింది.

ఈయన గతంలో బీఆర్​ఎస్​ మంత్రులనే బెదిరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్​లో చేరిన ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​పై కూడా భూ కబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే!. ఈ కేసుల నుంచి బయటపడేదెప్పుడంటూ పార్టీ ముఖ్యనేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికి లోక్​సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. వీటన్నింటిని అధిగమించి లోక్​సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం గులాబిబాస్​ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారో వేచిచూడాల్సిందే మరీ!

Spread the love

Related News

Latest News