ప్రతిపక్షం, జూలై 16: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందారు. న్యూజెర్సీలో జరిగిన ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (27) ప్రాణాలు కోల్పోయారు.
ప్రసన్న 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ఇటీవలే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.
ప్రమాదం తీవ్రతకు ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమార్తె అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.


















