ప్రతిపక్షం, జూలై 14: కాళేశ్వరం ప్రాజెక్టుపై రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, ఆ పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గ్రామాల వారీగా పర్యటిస్తూ కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదికలో బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవచ్చని సూచిస్తే వెంటనే నీటిని నింపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. నిపుణులు, ఇంజినీర్లు సూచించిన విధంగానే చర్యలు తీసుకుంటామని, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలను అమలు చేస్తామని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు చేయవద్దని బీఆర్ఎస్‌కు హితవు పలికారు. మేడిగడ్డ, కన్నెపల్లి అంశాలపై కావాలనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచిస్తూ, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ భేదాలు పక్కనబెట్టి ప్రతిపక్షం కూడా బాధ్యతాయుతంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.


















