ప్రతిపక్షం, జూలై 07: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని లంబాడి తండాలో నిర్వహించిన శీత పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం అంశంపై బీజేపీ, బీఆర్ఎస్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని మంత్రి గుర్తు చేశారు. నిజంగా అవినీతిపై పోరాడాలనే చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ధైర్యం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరిన మంత్రి, అలాంటి నిర్ణయం తీసుకోకపోతే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకే వైఖరితో వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు.
ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశంలో నిజాలు బయటకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

















