మాట్లాడుకుందామంటూ పిలిచి దారుణ హత్య.. బాలాపూర్‌లో కలకలం

ప్రతిపక్షం, జూలై 06: హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. మరియం కాలనీకి చెందిన ఫహద్ బల్కషర్ (28)పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటనగా ప్రారంభమైన కేసులో, జిమ్ పరిచయం నుంచి ఏర్పడిన పాత విభేదాలే హత్యకు కారణమైనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఫహద్‌కు జిమ్‌లో పరిచయమైన సలాం బౌమ్, సయీద్ బౌమ్‌లతో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామని నమ్మించి తెల్లవారుజామున పిలిచిన నిందితులు అతనిపై కిరాతకంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఫహద్‌ను వెంటనే ఒవైసీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల పాత్రపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు ఏసీపీ ప్రదీప్ వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Spread the love

Related News

Latest News