మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష.. బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, తొలి దశ పనులకు వేగం

ప్రతిపక్షం, జూన్ 27: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలి దశ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ, పునరావాసం, అభివృద్ధి పనులపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు కోసం అవసరమైన భూముల సేకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భూయజమానుల అభీష్టం మేరకు ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) లేదా తగిన పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నెక్లెస్ రోడ్డులో ప్రత్యేకంగా ‘మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రంలో ప్రాజెక్టు రూపురేఖలు, అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలను ఆధునిక సాంకేతికతతో ప్రజలకు చూపించేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.

మూసీ ప్రాజెక్టు అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల అభిప్రాయాలు, సూచనలను సేకరించి అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కీలకమని పేర్కొంటూ, తొలి దశ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Spread the love

Related News

Latest News