స్థానికులతో సద్ది తింటూ.. టిఫిన్ బైఠక్ లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూన్ 12: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి పాఠశాల ఆవరణలో ‘‘టిఫిన్ బైఠక్’’ నిర్వహించారు. అక్కడికి వచ్చిన గ్రామస్తులు, కార్యకర్తలంతా తమ వెంట సద్ది తెచ్చుకుని రాగా బండి సంజయ్ సైతం స్వయంగా ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ క్యారియన్ ఓపెన్ చేసి వారితో కలిసి అల్పాహారం తిన్నారు. ఈ సందర్భంగా రేకొండ స్కూల్ తరగతులను శుభ్రం చేసే అంశంపై చర్చించారు. పేదల చదవుల నిలయమైన ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని చెప్పారు. అందులో భాగంగా మోదీ పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా స్కూల్ ను క్లీన్ చేయాలని కోరారు. ఈనెల 16న ప్రతి గ్రామంలో పిల్లలంతా బడిలో చేరాలంటూ… ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఎంపీ అయ్యాక తాను సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు. ఈ సందర్భంగా స్కూల్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల సమస్య ఉందని ఈ సందర్భంగా టీచర్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ.5 లక్షల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అట్లాగే ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి, కుల సంఘాల భవన నిర్మాణానికి రూ.20 లక్షల సాయం చేస్తానని తెలిపారు. తొలి విడతగా రూ.10 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం స్కూల్ లోని తరగతి గదులతోపాటు డైనింగ్ హాలును కూడా సందర్శించారు. స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. టెన్త్ అత్యధిక మార్కులు సాధించిన రేకొండ స్కూల్ విద్యార్థులను అభినందించడంతోపాటు వారితో కలిసి ఫోటో దిగారు. ఈసారి కూడా ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థుందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించారు. మోదీ పాలనా విజయాల బుక్ లెట్లను ఈ సందర్భంగా హెడ్మాస్టర్ కు అందించారు. మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ఎవరికి వారే తమ వెంట అల్పాహారం క్యారియర్ లను తెచ్చుకుని పాఠశాల ఆవరణలో కూర్చుని తిన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల తరగతులను పరిశీలించి… ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా వాటిని క్లీన్ చేసేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకున్నారు. రేపు ఉదయం వారంతా తమ తమ గ్రామాల్లోని పాఠశాలలను శుభ్రం చేయనున్నారు. అందుకోసం సొంతంగా చీపురు, క్లాత్, బకెట్ ను కూడా వెంట తెచ్చుకోనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ‘‘స్వచ్ఛ పాఠశాల’’లో భాగంగా సరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. స్వయంగా చీపురు, క్లాత్, బకెట్ వెంట తెచ్చుకుని అక్కడికి వచ్చిన కార్యకర్తలు, స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి తరగతి గదులను శుభ్రం చేయనున్నారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలో కొంత మంది ప్రభావ శీలుర(ఇన్ ఫ్లూయన్సర్స్) ను కలిసి మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించిన పుస్తకాలను బండి సంజయ్ అందజేయనున్నారు.

Spread the love

Related News

Latest News