ప్రతిపక్షం, జూలై 17: తెలంగాణలో ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆగస్టు 15 నుంచి అర్హులైన ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి మాత్రమే అందేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.

















