ప్రతిపక్షం, జూలై 09: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని మొత్తం కోర్ అర్బన్ ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోలార్ ఆక్సీ ట్రీ, సోలార్ ఆధారిత వీధి దీపాలు, గాలి శుద్ధి వ్యవస్థతో పాటు సంస్థ తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యల నుంచి హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని సుమారు 2,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1.35 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా ఆధునిక, కాలుష్య రహిత నగరాన్ని నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని చెప్పారు.
జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల కాలుష్యంతో పాటు మూసీ నది కాలుష్యం నగర ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. అందుకే ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను దశలవారీగా బయటకు తరలించేందుకు చట్టం తీసుకువచ్చామని తెలిపారు. ఓఆర్ఆర్ వెలుపల ప్రత్యేక తయారీ మండలిని ఏర్పాటు చేసి, అక్కడ పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.
ఆ తయారీ మండలిలో తొలి పరిశ్రమగా ప్రిమియర్ ఎనర్జీస్ కేవలం 12 నెలల్లో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తూ, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు వైట్ కాలర్ ఉద్యోగాలతో పాటు బ్లూ కాలర్ నైపుణ్యాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, అధునాతన శిక్షణా కేంద్రాలు, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను సిద్ధం చేస్తున్నామని సీఎం వివరించారు.
ప్రకృతి పరిరక్షణతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగం పెంపు కాలానుగుణ అవసరమని పేర్కొన్న ముఖ్యమంత్రి, సోలార్ శక్తితో గాలిని శుద్ధి చేసే ఆక్సీ ట్రీ వంటి వినూత్న సాంకేతికతలను అభివృద్ధి చేసిన ప్రిమియర్ ఎనర్జీస్‌ను అభినందించారు. కాలుష్య నియంత్రణలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన పిలుపునిచ్చారు.






















