ప్రతిపక్షం, జూలై 09: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన భేటీలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, కడియం శ్రీహరి తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడిని కోరినట్లు సమాచారం.
ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ కార్యకర్తల్లో అయోమయానికి దారితీయకుండా, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సమస్యను పార్టీ పరంగా పరిశీలించి ఇరువురితో మాట్లాడతామని తెలిపారు.
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఉన్న విభేదాలను త్వరలోనే పరిష్కరించి పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయం కొనసాగించే దిశగా పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.


















