Trending Now

ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపనలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణతో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని తెలిపారు. ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రాజెక్టును పక్కనబెట్టిందన్నారు. మేం అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి.. ప్రధాని మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించి.. సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు.

భూముల కేటాయింపు, చాంద్రాయణగుట్ట రక్షణ శాఖ భూముల లీజ్ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వం జాప్యం చేసిందని.. అధికారంలోకి రాగానే తక్షణమే మేం అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములు అప్పగించామని తెలిపారు. ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని.. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలని సీఎం రేవంత్ అన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో కేంద్రం రాష్ట్రానికి సహకరించింది. పదేళ్ల బీఆరెస్ దిక్కుమాలిన విధానాలతో ప్రజలకు శిక్ష పడిందని.. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగా.. రాజకీయాల కోసం కాదని.. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మా లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

Spread the love