తెలంగాణ హక్కుల కోసం భూ పోరాటం.. జులై రెండున భారీ ఉద్యమానికి కవిత పిలుపు

ప్రతిపక్షం, జూన్ 25: తెలంగాణ స్థానికుల హక్కుల పరిరక్షణ, ఉద్యమకారులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో జులై రెండున నిర్వహించనున్న భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, తెలంగాణ స్థానికత విషయంలో మరోసారి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా గుర్తించాలన్న న్యాయస్థాన తీర్పును ప్రస్తావించిన కవిత, తెలంగాణ యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డల హక్కుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు.

ఉద్యమకారులకు భూముల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించిన ఆమె, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఇప్పటికీ న్యాయమైన ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఉద్యమకారులు, నిరుద్యోగ సంఘాలతో కలిసి ప్రభుత్వ భూముల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. పేదలకు భూములు అందేలా పోరాటం చేస్తామని తెలిపారు.

జల హక్కుల అంశాన్ని ప్రస్తావిస్తూ తుంగభద్ర జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగేలా నిర్ణయాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. రాజోలిబండ మళ్లింపు కాలువ పరిధిలో కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నీటి హక్కులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో మరింత దృఢంగా వ్యవహరించాలని కోరారు.

అంతేకాకుండా తుంగభద్ర జలాల అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కేంద్ర జల సంఘం వద్ద పోరాటం చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేసిన కవిత, అంబర్‌పేట నియోజకవర్గంలో పోటీ చేస్తానని ప్రకటించారు. తెలంగాణ హక్కులు, ఉద్యమకారుల సంక్షేమం, యువత ఉపాధి అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News