పేదల ఇళ్ల కూల్చివేతలపై హరీశ్‌రావు ఆగ్రహం

ప్రతిపక్షం, జూన్ 23: ఖమ్మం జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు పేదల సంక్షేమం పేరుతో పాలన సాగిస్తున్నామని చెబుతూ, మరోవైపు పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. ఏ ప్రభుత్వం అయినా పేదలకు గూడు కల్పించాల్సిన బాధ్యత వహించాలి గానీ, వారి నివాసాలను తొలగించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.

పేదల స్థలాలు, ఇళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హరీశ్‌రావు, బాధితులకు వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టర్‌తో మాట్లాడినట్లు పేర్కొంటూ, పేదల హక్కులకు భంగం కలిగితే తమ పార్టీ తరఫున తీవ్ర స్థాయిలో పోరాటం చేపడతామని హెచ్చరించారు.

జర్నలిస్టుల సమస్యలపైనా స్పందించిన ఆయన, ఖమ్మం జిల్లాలోని మీడియా ప్రతినిధులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో జర్నలిస్టులకు స్థలాలు ఇస్తామని ప్రకటిస్తున్న ప్రభుత్వం, ఖమ్మం జర్నలిస్టులను ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. అవసరమైతే జర్నలిస్టుల హక్కుల కోసం తానే ముందుండి పోరాడతానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన హరీశ్‌రావు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రాథమిక హామీలను కూడా అమలు చేయలేకపోతోందని అన్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా వ్యవహరిస్తే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News