జర్మనీతో తెలంగాణ కీలక ఒప్పందం.. నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులకు కొత్త దారులు

ప్రతిపక్షం, జూన్ 04: శాస్త్ర సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, జీవ వైజ్ఞానిక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, జర్మనీలోని థూరింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో థూరింగియా రాష్ట్ర మంత్రి-అధ్యక్షుడు మారియో ఫోగ్ట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమై పెట్టుబడులు, విద్య, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించింది. తెలంగాణ అభివృద్ధి, ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోందని మారియో ఫోగ్ట్ ప్రశంసించారు.

కృత్రిమ మేధస్సు యుగంలో మారుతున్న ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేలా విద్యా, శిక్షణ వ్యవస్థను ఆధునీకరించాలని సూచించారు.

జర్మన్ భాషా శిక్షణ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. అలాగే యువతకు జర్మనీ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందించేందుకు భాగస్వామ్యం పెంచాలని కోరారు.

తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల గురించి సీఎం వివరించారు. ప్రపంచ ప్రముఖ సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు.

సెమీకండక్టర్, ఏరోస్పేస్, మెడ్‌టెక్, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో జర్మనీ సంస్థల పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడానికి థూరింగియా ప్రభుత్వం సహకరిస్తామని ప్రతినిధి బృందం హామీ ఇచ్చింది.

ఈ ఒప్పందంతో తెలంగాణ–జర్మనీ మధ్య పారిశ్రామిక, విద్యా, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

Related News

Latest News