*సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.
*బాలికలకు హెచ్.పి.వి వ్యాక్సిన్ తప్పనిసరి చేయాలి.
*మందుల నిల్వలు, రికార్డుల పరిశీలన – నూతన భవన నిర్మాణ పనుల పర్యవేక్షణ
*రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి – జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి డా. రాహుల్.
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 14: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని నల్లగొండ జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాహుల్ స్పష్టం చేశారు. బుధవారం చండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం పీహెచ్సీకి చేరుకున్న డీఎంహెచ్ఓ, ముందుగా ఓపీ విభాగం, వార్డులు, ల్యాబ్, ఫార్మసీ, టీకా విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే సిబ్బంది ప్రవర్తన, సేవల్లో నాణ్యత కీలకమని అన్నారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. డ్యూటీ సమయంలో ఎవరూ అందుబాటులో లేకుండా ఉండకూడదని సూచించారు.
*సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి:
ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంహెచ్ఓ ఆదేశించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా గ్రామాల్లో ఇంటింటి సర్వేలు చేపట్టాలని, దోమల నివారణకు ఫాగింగ్, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జ్వరంతో వచ్చే ప్రతి రోగికి తప్పనిసరిగా రక్త పరీక్షలు నిర్వహించి, సకాలంలో చికిత్స అందించాలన్నారు.
*హెచ్.పి.వి వ్యాక్సిన్ పై అవగాహన:
అర్హులైన బాలికలందరికీ గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే హెచ్.పి.వి వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ సిబ్బందికి సూచించారు. పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ శాతం పెంచాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు రెగ్యులర్ వ్యాక్సినేషన్ లో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.
*మందులు, రికార్డుల తనిఖీ:
అనంతరం డీఎంహెచ్ఓ మందుల నిల్వ గదిని పరిశీలించారు. మందుల నిల్వలు, వాటి గడువు తేదీలు, స్టాక్ రిజిస్టర్లు, ఓపీ రికార్డులు, జనన-మరణ రిజిస్టర్లు, ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గడువు ముగిసిన మందులు లేకుండా చూసుకోవాలని, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పీహెచ్సీ ఆవరణలో పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.
*నూతన భవన నిర్మాణ పనుల పర్యవేక్షణ: చండూరు పీహెచ్సీ నూతన భవన నిర్మాణ పనులను డీఎంహెచ్ఓ స్వయంగా పర్యవేక్షించారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని అన్నారు.ఈ తనిఖీ కార్యక్రమంలో హెచ్ఈఈఓ అంజయ్య, రంజిత్, వైద్యాధికారి డాక్టర్ సంధ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకటేశం, పీహెచ్సీ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.





























