3.5 లక్షల మంది విద్యార్థులతో ‘సైబరాబాద్ మూవ్స్–2026’కు శ్రీకారం!

400కు పైగా విద్యాసంస్థల భాగస్వామ్యం.. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో విద్యార్థులకూ భాగస్వామ్యం

నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు

సైబరాబాద్, ప్రతిపక్షం,నవంబర్ 17: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ‘సైబరాబాద్ మూవ్స్–2026’ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని పోలీస్, మున్సిపల్ శాఖలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా 400కు పైగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన, ఐఏఎస్ ఆధ్వర్యంలో తొలిసారిగా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. జూమ్ ద్వారా 400కు పైగా విద్యాసంస్థలు పాల్గొనగా, మరో 200 నుంచి 300 మంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకేచోట కూర్చొని ఈ సమావేశాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే మార్గాలను సురక్షితంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దడంలో వారి అభిప్రాయాలు కీలకమని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలు చూపడంలో విద్యార్థులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సీఈఓ నవీద్ ఖాన్, డబ్ల్యూఆర్ఐ ఫెలో శ్రీనివాస్ అలవల్లి సైబరాబాద్ మూవ్స్ కార్యక్రమం లక్ష్యాలు, ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రాధాన్యత, విద్యార్థులు పాల్గొనే విధానాన్ని వివరించారు. ఈ సమావేశంలో డీసీపీ ట్రాఫిక్-1 రవికుమార్, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ హనుమంతరావు పాల్గొన్నారు.

టీ-హబ్‌లో విద్యార్థులకు వినూత్న అనుభవాలు

నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో నిర్వహించే సైబరాబాద్ మూవ్స్ కార్యక్రమంలో విద్యార్థులకు పలు ప్రత్యేక అనుభవాలు కల్పించనున్నారు. భారీ మ్యాప్‌లపై తమ ఇళ్లు, పాఠశాలలు, నిత్యం ప్రయాణించే మార్గాలను గుర్తించే అవకాశం కల్పిస్తారు. రహదారులను ఎలా దాటాలి, ఫుట్‌పాత్‌లను ఎలా వినియోగించుకోవాలి, సురక్షిత ప్రయాణం ఎలా సాగించాలనే అంశాలపై అవగాహన కల్పిస్తారు.

అంతేకాకుండా పోలీస్, పట్టణ ప్రణాళిక నిపుణులు, ఇంజినీర్లు, మెట్రో, బస్సు రవాణా విభాగాల పనితీరును తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో ఎంపికైన విద్యార్థుల వినూత్న ఆలోచనలను కూడా ప్రదర్శించనున్నారు.

సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలు, తల్లిదండ్రులు, పోలీసులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, రహదారి ప్రమాదాలను నివారించడం, స్వచ్ఛమైన గాలి, మెరుగైన పర్యావరణాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • నవంబర్ 20: ఇన్నోవేషన్ ఛాలెంజ్ దరఖాస్తులకు చివరి తేదీ.
  • నవంబర్ 26–28: టీ-హబ్‌లో సైబరాబాద్ మూవ్స్–2026.
  • సమయం: ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.
  • రిజిస్ట్రేషన్: cyberabadmoves.in

Related News

Latest News