తాగునీటిని వృథా చేయొద్దు

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి.. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 30: ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.శుక్రవారం కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవోతో కలిసి గ్రామంలోని నీటి వనరుల లభ్యత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, వి.బి.-జి. రామ్ ఉపాధి పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో మొదటి, రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఇళ్లు మంజూరై నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకు అవగాహన కల్పించి, అధికారుల సూచనల మేరకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.వి.బి.-జి. రామ్ ఉపాధి హామీ పథకంలో పలు రకాల పనులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుని కూలీల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ కూలీలకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, స్థానిక సర్పంచ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News