క్రీడా శక్తిగా భారత్‌ ఎదుగుతోంది: రఘునందన్‌రావు

ప్రతిపక్షం, జూన్ 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచ క్రీడారంగంలో శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని మెదక్‌ ఎంపీ, తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడు మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ నాలుగో రోజు పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, దేశంలో క్రీడా రంగ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు.

గత దశాబ్ద కాలంలో ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో సన్స్‌ద్ ఉత్సవ్’ వంటి కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతికి కొత్త ఊపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమాలు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే క్రీడాకారులను తయారు చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఆసియా ఖండంలోని 30 దేశాల నుంచి 400 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి పోటీల నిర్వహణలో భారత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోందని, ఇలాంటి టోర్నమెంట్లు భారత క్రీడాకారులకు విలువైన అనుభవాన్ని అందిస్తాయని తెలిపారు.

‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది మంది యువ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించే అవకాశాలు పొందుతున్నారని రఘునందన్‌రావు చెప్పారు. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతోందని అభిప్రాయపడ్డారు.

పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, అధికారులు, సిబ్బందిని అభినందించిన ఆయన, విజేతలకు పతకాలు ప్రదానం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News