ప్రతిపక్షం, ఆగస్టు 14: హైదరాబాద్‌ను పర్యావరణహిత నగరంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ పథకం ద్వారా హైదరాబాద్‌లోని 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన ఆటో డ్రైవర్లకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ అందించనున్నారు.
పాత ఆటోకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకునే అవకాశం కల్పించడంతో పాటు, అర్హత ఉన్నవారు కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసేందుకు కూడా ఈ పథకం ద్వారా సహాయం పొందవచ్చు.
పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, హైదరాబాద్‌ను పచ్చని నగరంగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.





























