ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: వరంగల్ మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విమానాశ్రయానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను మరో రెండు వారాల్లో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అనంతరం డిసెంబరులో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధి, మామునూరు విమానాశ్రయం పనులతో పాటు పర్యాటక రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేసి.. డిసెంబరులో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేలా ముందుకు వెళ్లాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీంతో వరంగల్ ప్రాంతంలో విమాన సేవల ఏర్పాటుపై ఆశలు మరింత పెరిగాయి.
మరోవైపు తెలంగాణలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని వివరించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ హెలీ టూరిజానికి ప్రోత్సాహం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
మామునూరు విమానాశ్రయానికి శంకుస్థాపనకు డిసెంబర్ గడువు ప్రకటించడం, మరోవైపు హెలీ టూరిజం అభివృద్ధిపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం తెలంగాణ విమానయాన, పర్యాటక రంగానికి కీలక పరిణామంగా మారింది.





























