[t4b-ticker]

హైదరాబాద్‌కు కొండా సురేఖ.. నేడు అనుచరులతో కీలక భేటీ!

ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయనున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. తనకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వివరణ ఇచ్చినట్లు సురేఖ తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పార్టీ అగ్రనేతలకు వివరించినట్లు వెల్లడించారు.

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసిన సందర్భంగా మొత్తం పరిణామాలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు సురేఖ చెప్పారు. తన వాదనను పూర్తిగా వివరించానని, జరిగిన ఘటనలకు సంబంధించిన విషయాలను అధిష్ఠానం ముందు ఉంచినట్లు పేర్కొన్నారు.

తాను ఇచ్చిన వివరణపై ఖర్గే, మీనాక్షి నటరాజన్‌ స్పందిస్తూ ‘చూస్తాము.. ఆలోచిస్తాము’ అని చెప్పినట్లు సురేఖ వెల్లడించారు. దీంతో పార్టీ అధిష్ఠానం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆమెకు అధిష్ఠానం నుంచి వచ్చిన స్పందన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక ఢిల్లీ పరిణామాల అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న సురేఖ, తన రాజకీయ భవిష్యత్తు, పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చలపై అనుచరులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్‌కు చెందిన తన అనుచరులతో నేడు భేటీ అయి తాజా పరిస్థితులను వివరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

సురేఖపై చర్యలు తీసుకునే అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇంకా తుది నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమె ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సురేఖ తన అనుచరులతో చర్చించనున్న నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తూనే, రాష్ట్రంలో తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగించేందుకు సురేఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వ్యవహారంలో రానున్న రోజుల్లో చోటుచేసుకునే పరిణామాలపై కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News

Latest News