గౌడ భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

ప్రతిపక్షం, నవంబర్ 29: హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్‌లో గౌడ అధికారుల, వృత్తి నిపుణుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌడ సామాజిక వర్గం అభివృద్ధికి ఐక్యతతో ముందుకు సాగాలని, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. గౌడ భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, అవసరమైతే ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, గౌడ అధికారుల, వృత్తి నిపుణుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌ తరాల అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని, దానితో పాటు నైపుణ్యాభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన పాత బకాయిలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు.

సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహ ఏర్పాటుతో పాటు జనగామ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కూడా మంత్రి చర్చించారు. గీత కుటుంబాలకు చెందిన ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు దాదాపు 18 మంది రాజకీయాలకు అతీతంగా ఒక్కటై సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక ఐక్యతతోనే వర్గానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు భవిష్యత్‌ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించగలమని పేర్కొన్నారు.

గౌడ భవన నిర్మాణానికి సంబంధించి గతంలో కేటాయించిన స్థలంలో నిధులు ఖర్చు కాకపోవడంతో అవి ల్యాప్స్‌ అయ్యాయని మంత్రి తెలిపారు. ఇటీవల తిరిగి రూ.5 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే పునాది వేసిన భవన నిర్మాణ పనులను గౌడ పెద్దలు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి ఎలాంటి జాప్యం లేకుండా ప్రారంభించాలని కోరారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చెట్లపై నుంచి పడి గాయపడిన గీత కార్మికులకు సంబంధించిన పెండింగ్‌ ఎక్స్‌గ్రేషియా కేసుల వివరాలను తనకు అందించాలని మంత్రి కోరారు. పూర్తి వివరాలు అందిన వారం, పది రోజుల్లో పెండింగ్‌ కేసులన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గీత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

గౌడ సామాజిక వర్గం అభివృద్ధికి గతంలోనూ తాను కృషి చేశానని పొన్నం ప్రభాకర్‌ గుర్తుచేశారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న సమయంలో పెద్ద గౌడ హాస్టల్‌ నిర్మాణానికి కృషి చేశానని, గౌడ సంఘ భవన నిర్మాణానికి సహకరించానని చెప్పారు. వేములవాడలో 40 ఏసీ గదులతో గౌడ సత్రాన్ని నిర్మించామని, జోగులాంబ వద్ద కూడా గౌడ సత్రం నిర్మాణానికి సహకరిస్తానని వెల్లడించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గానికి చెందిన, గతంలో గౌడ అధికారుల, వృత్తి నిపుణుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన పోదారి వెంకటరాజం సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.

తాను విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నానని, రేణుక ఎల్లమ్మ తల్లి, తల్లిదండ్రులు, ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరుకున్నానని మంత్రి పేర్కొన్నారు. తనకు లభించిన అవకాశాలను సామాజిక వర్గ అభివృద్ధికి ఉపయోగించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎవరికైనా సమస్యలు ఎదురైతే తనను సంప్రదించవచ్చని, నేరుగా కలవలేని వారు సంఘ నాయకుల ద్వారా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తాను ఎప్పుడూ ఆ సామాజిక వర్గానికి చెందిన బిడ్డగానే అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం గీత వృత్తిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. మార్కెట్‌లో ముంజలకు మంచి ధర లభిస్తున్నప్పటికీ వాటిని కోసే కార్మికుల సంఖ్య తగ్గుతోందని, చాలామంది చెట్లు ఎక్కలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను సంఘాలు అన్వేషించాలని సూచించారు. సామాజిక సంఘాల్లో ఐక్యతను పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్‌ తరాల కోసం చెట్ల పెంపకం, మొక్కల నాటే కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. సభ్యత్వాల విస్తరణ, సంఘాల బలోపేతం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల నిర్వహణ వంటి అంశాల్లో సమష్టిగా ముందుకు సాగాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు.

Related News

Latest News