– కేవీఎల్, ఏఐపీఎస్ఓ తెలంగాణ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబరు 24: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధోన్మాదాన్ని అరికట్టి, ప్రపంచ శాంతిని పరిరక్షించేందుకు వామపక్ష, ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా ముందుకు రావాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్ఓ) తెలంగాణ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ఆకలి, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్ఓ) సిద్దిపేట జిల్లా మూడో మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కేవీఎల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తులు తమ ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు యుద్ధాలను ప్రోత్సహిస్తూ మానవాళి మనుగడకు ముప్పు తెస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా, లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయుధాల తయారీ, యుద్ధాల కోసం వెచ్చిస్తున్న అపారమైన సంపదను ప్రజల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని ఆకాంక్షించారు. ప్రపంచ శాంతి అంటే కేవలం యుద్ధాలు లేని పరిస్థితి మాత్రమే కాదని, ఆకలి, పేదరికం, అసమానతలు, కుల, మత, జాతి వివక్ష లేని సమాజ నిర్మాణం ద్వారానే నిజమైన శాంతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలు, లౌకిక విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సీపీఐ సిద్ధిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాపాడటంలో వామపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, శాంతికాముకులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలను బలోపేతం చేస్తూ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.
ఏఐపీఎస్ఓ సిద్దిపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక
అనంతరం ఏఐపీఎస్ఓ సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షవర్గ సభ్యులుగా గజాభీంకార్ బన్సీలాల్, టి.యాదగిరి, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శులుగా జాలిగామ శిరీష, రామగళ్ల నరేశ్, జిల్లా ఉపాధ్యక్షులుగా పిట్ల మల్లేశం, జేరిపోతుల జనార్దన్, అనిల్, అనిరుధ్, సహాయ కార్యదర్శులుగా రజిని, రంజిత్, మాచర్ల శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ఆంజనేయులు, యుగంధర్, అంతయ్య, యాదగిరి, పంపరి నగేశ్ లను ఎంపిక చేశారు.ఈ మహాసభలో సీపీఐ సిద్ధిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, వివిధ ప్రజా సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



























