రుణమాఫీ, రైతుబంధు బకాయిలు చెల్లించి సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టాలి
సిద్ధిపేట అభివృద్ధి పనులకు రూ.1,070 కోట్ల నిధులు విడుదల చేయాలి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబర్ 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న సిద్దిపేట పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. సిద్ధిపేట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరోసారి జిల్లాకు రావడం ఎందుకని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా నిధులు విడుదల చేసిన తర్వాతే సిద్దిపేటలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునఃప్రారంభించాలని, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. తనపై ఉన్న రాజకీయ కక్షను సిద్దిపేట ప్రజలపై చూపవద్దని ముఖ్యమంత్రికి హితవు పలికారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న ముఖ్యమంత్రి సిద్దిపేటకు వస్తున్నారంటే ప్రజలు ఏదైనా మేలు జరుగుతుందని ఆశిస్తారని హరీశ్ రావు అన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన ప్రతిసారీ మల్లన్నసాగర్, మెడికల్ కాలేజీ, జిల్లా కలెక్టరేట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు సిద్ధిపేటకు వచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
2024 మే 2న తొలిసారి సిద్దిపేటకు వచ్చిన ముఖ్యమంత్రి కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికీ చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, గ్రామంలోనూ రుణమాఫీ పూర్తికాలేదని విమర్శించారు.
సిద్ధిపేట నియోజకవర్గంలో 20,514 మందికి మాత్రమే రుణమాఫీ జరిగితే, 22,819 మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని వెల్లడించారు. రుణమాఫీ హామీని నమ్మి రూ.రెండు లక్షలకు పైగా అప్పులున్న రైతులు ఇతర మార్గాల్లో డబ్బులు సమకూర్చుకుని బ్యాంకుల్లో చెల్లించారని, చివరకు వారు మోసపోయారని అన్నారు. రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అందరికీ రుణమాఫీ చేసిన తర్వాతే సిద్దిపేటకు రావాలని, అప్పుడు తానే స్వయంగా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతానని వ్యాఖ్యానించారు. రెండోసారి 2026 మార్చి 22న సిద్ధిపేటకు వచ్చిన ముఖ్యమంత్రి, కేసీఆర్ హయాంలో నిర్మించిన ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఆ సందర్భంగా 45 రోజుల్లో రూ.తొమ్మిది వేల కోట్ల రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 230 రోజులు గడిచినా నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. యాసంగి రైతుబంధు విషయంలోనూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే వెంటనే రైతుభరోసా నిధులు విడుదల చేసి సిద్దిపేటకు రావాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం సిద్దిపేటకు మంజూరు చేసిన వెటర్నరీ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రద్దు చేసిందని ఆరోపించారు. 2024 ఫిబ్రవరి 29న ఆ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు తరలించారని విమర్శించారు. వెంటనే వెటర్నరీ కాలేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.సిద్దిపేటకు మంజూరైన ఔటర్ రింగ్ రోడ్డు, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, శిల్పారామం, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ పాఠశాల, స్పోర్ట్స్ స్టేడియం, ఆడిటోరియం తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1,070 కోట్ల పనులను నిలిపివేశారని ఆరోపించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను పూర్తి చేయకుండా ఆపడం ఏమిటని ప్రశ్నించారు. పెండింగ్ నిధులు విడుదల చేసి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలోని 87 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు మంజూరు చేసి సిద్ధిపేటకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సిద్దిపేట లేదా? అని నిలదీశారు. వివక్ష లేదని చెబుతూనే స్పష్టంగా వివక్ష చూపుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని రేవంత్ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. తిరిగి ప్రారంభిస్తామని చెబుతున్న ప్రభుత్వం సిద్ధిపేట పాఠశాలల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సిద్ధిపేట ప్రాంతంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయని హరీశ్ రావు తెలిపారు. మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పర్యటించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు పరిహారం అందలేదన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందించి రైతులను ఆదుకునేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ నిర్మాణ సమయంలో రేవంత్ రెడ్డి 48 గంటల దీక్ష చేశారని హరీశ్ రావు గుర్తుచేశారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని పెద్దపెద్ద మాటలు చెప్పారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం మంది నిర్వాసితులకు పరిహారం అందించిందని తెలిపారు. కోర్టు ఆదేశాలు, స్టేల కారణంగా నిలిచిపోయిన పరిహారం చెల్లింపులకు ఇప్పుడు అడ్డంకులు తొలగినా మూడేళ్లుగా ఎందుకు పరిహారం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకెళ్తామని చెబుతున్న ప్రభుత్వం, అదే ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించాలని సూచించారు.
గతంలో ఇచ్చిన పరిహారం కంటే ఎక్కువ ఇచ్చినా అభ్యంతరం లేదని, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తే సిద్దిపేట జిల్లాకు కరువు పరిస్థితులు ఉండవని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నీటిని ఎత్తిపోకుండా జిల్లాను కరువు బారిన పడేలా చేస్తోందని ఆరోపించారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ కింద కొత్త కాలువలు తవ్వకపోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. సొంత డబ్బులతో రైతులే కాలువలు తవ్వించుకుంటూ నీటిని తీసుకుంటున్నారని తెలిపారు. మిరుదొడ్డి మండలానికి సాగునీరు అందించే ఇర్కోడ్ లిఫ్ట్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన ఐదు శాతం పనులను మూడేళ్లుగా పూర్తి చేయడం లేదని విమర్శించారు. గౌరవెల్లి రిజర్వాయర్‌లో ఒక టీఎంసీ నీటిని నింపినా కాలువలు తవ్వకపోవడం, మరమ్మతులు చేయకపోవడంతో ఒక్క ఎకరాకూ నీరు అందడం లేదన్నారు. హుస్నాబాద్ ప్రాంత రైతులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లికి నీటిని తరలించే పనులు కేసీఆర్ ప్రారంభించారని, 50 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆ పనులు పూర్తయితే చేర్యాల ప్రాంతం సస్యశ్యామలమయ్యేదని పేర్కొన్నారు. కొండపోచమ్మసాగర్ కాలువల పనులను కూడా నిలిపివేశారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల పనులను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల వినియోగంలో వైఫల్యం
కృష్ణా జలాల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. గత మూడేళ్లలో కృష్ణా జలాలను అత్యల్పంగా వినియోగించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. దేవాదుల, కాళేశ్వరం, సీతమ్మసాగర్, సమ్మక్క బ్యారేజీ, పాలమూరు ప్రాజెక్టులకు కరువును ఎదుర్కొనే సామర్థ్యం ఉందని చెప్పారు. ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే రాష్ట్రం కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేదన్నారు.తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసం మార్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అసెంబ్లీలోనే అన్ని ఆధారాలతో సమాధానం ఇచ్చామని చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, కేంద్ర జల సంఘం లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. నీళ్లు లేని ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తే ప్రజాధనం వృథా అవుతుందని చెప్పారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతానికి ప్రాజెక్టును మార్చి గతంలో పెట్టిన ఖర్చును సద్వినియోగం చేశామని వివరించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో పనులు చేయకుండానే బిల్లులు చెల్లించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని రద్దు చేసి పారదర్శకంగా పనులు చేపట్టామని తెలిపారు. అనుమతుల విషయంలో ఏడేళ్లపాటు కాలయాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఇప్పుడు తమపై నిందలు వేయడం సరికాదన్నారు. గత ఏడేళ్లు, ప్రస్తుత మూడేళ్లు కలిపి పదేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ఒక్క కొత్త ప్రాజెక్టు నిర్మించలేదన్నారు. కొత్తగా ఒక్క ఎకరానికీ సాగునీరు అందించలేదని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని హరీశ్ రావు అన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఒక్కో అవ్వ, తాతకు రూ.72 వేల బకాయి పడిందని, ఆ మొత్తంతో సహా పింఛన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదని, ఇప్పటివరకు రూ.90 వేల బకాయి పేరుకుపోయిందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులకు ఇబ్బందులు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించిందని, ప్రస్తుత ప్రభుత్వం రూ.600 కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని, సర్టిఫికెట్లు అందక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆగిపోయిన ఆసుపత్రులు, రోడ్లు, అభివృద్ధి పనులు
సిద్దిపేటలో వెయ్యి పడకల ఆసుపత్రి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. 50 పడకల ఆయుష్ ఆసుపత్రికి రిబ్బన్ కట్ చేసి ఏడాది గడిచినా వైద్య సేవలు ప్రారంభించలేదని విమర్శించారు. రూ.160 కోట్లతో చేపట్టిన సిద్దిపేట రింగ్ రోడ్డు పనులు 90 శాతం పూర్తయినా మిగిలిన పనులను పూర్తి చేయడం లేదన్నారు.
శిల్పారామం, నర్సింగ్ కాలేజీ భవనం, రంగనాయకసాగర్ పర్యాటక ప్రాజెక్టు, మల్టీపర్పస్ ఆడిటోరియం, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపారు. చిన్నకోడూరు మండలంలో రహదారులు గుంతలమయంగా మారాయని అన్నారు. ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు.నా మీద కోపం ఉంటే నాపైనే చూపించండి.. ప్రజలపై కాదు సిద్దిపేట ప్రజలను ముఖ్యమంత్రి రెండుసార్లు మోసం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. మొదటిసారి రైతు రుణమాఫీ పేరుతో, రెండోసారి రైతుభరోసా నిధుల పేరుతో హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదన్నారు.
కొడంగల్‌లో తనను ఓడించారనే రాజకీయ కక్షతో సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకోవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. తనపై కోపం ఉంటే తనపై చూపించాలని, ప్రజలపై చూపించవద్దని అన్నారు. తన పొడవు, కేటీఆర్ గడ్డం గురించి మాట్లాడటం కాదని, ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఆ పదవికి గౌరవం తీసుకురావాలని వ్యాఖ్యానించారు.సిద్దిపేటకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తాము కోరడం లేదని, ఇప్పటికే మంజూరై ప్రారంభమైన పనులను పూర్తిచేయాలని మాత్రమే అడుగుతున్నామని స్పష్టం చేశారు. నిలిపివేసిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని, పెండింగ్ నిధులు విడుదల చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ చేశారు.హామీలు నెరవేర్చాకే సిద్దిపేటకు రావాలి. ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడవద్దు. మరోసారి మోసం చేయవద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
































