మనోహరాబాద్కే పరిమితం చేయడంపై అభ్యంతరం.. గ్రామాల వారీగా కరువు అంచనా వేయాలని డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 29: మెదక్ జిల్లాలో కరువు మండలాల ఎంపికలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొండల్ రెడ్డి. నాయకులు పిడి ఆనందం.విమర్శించారు. జిల్లాలో మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే కరువు ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఇతర మండలాల్లో నష్టపోతున్న రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు.ప్రభుత్వం ప్రకటించిన ప్రమాణాల ప్రకారం మైనస్ 17 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాలని, జిల్లాలోని అన్ని మండలాల వర్షపాత వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. చిలప్‌చెడ్‌లో మైనస్ 39, నర్సాపూర్‌లో మైనస్ 26, నిజాంపేట, హవేలీ ఘనపూర్‌లో మైనస్ 19, రామాయంపేటలో మైనస్ 18 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వివరించారు.
మండలాన్ని యూనిట్‌గా కాకుండా గ్రామాల వారీగా కరువు పరిస్థితులను అంచనా వేయాలని వారు డిమాండ్ చేశారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి పెట్టుబడులు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించి నష్టపరిహారం అందించాలని కోరారు. యాసంగి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో, సాగుకు దూరంగా ఉండే రైతులకు సైతం జీవనోపాధి నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.భూగర్భ జలమట్టాలు పడిపోతుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. కరువు అంచనాలను కేవలం రిమోట్ సెన్సింగ్ వివరాలకే పరిమితం చేయకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు, భూగర్భ జలాలు, తాగునీటి సమస్యలను పరిశీలించాలని కోరారు.
వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేలా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లోనూ వాటిని తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు జిల్లాలోని వాగుల నుంచి ఇసుక అక్రమ తరలింపుపై అధికారులు నిఘా పెట్టాలని, పర్యావరణం, భూగర్భ జలాలపై పడే ప్రభావాన్ని పరిశీలించి అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కరువు పరిస్థితులను కాగితాలపై కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, గ్రామాల వారీగా నష్టాలను గుర్తించి రైతులకు న్యాయం చేయాలని కొండల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మెదక్ సిటిజన్ ఫోరం నాయకుడు పీడీ ఆనందం తదితరులు పాల్గొన్నారు.





























