ప్రతిపక్షం, జూన్ 30: తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి నితిన్ నబీన్ పర్యటన నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా ఘట్‌కేసర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.
నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణకు ఈ సమావేశం కీలకంగా మారే అవకాశముందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

















