Trending Now

పాలమూరు వెనుకబాటుతనానికి కారణం ఆయనే.. సీఎం రేవంత్​పై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఫైర్​

ప్రతిపక్షం, సంగారెడ్డి: మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలన్నారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని విమర్శించారు. పాలమూరు వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సంగారెడ్డిలో పార్టీ నాయకులతో కలిసి హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడారు. పాలమూరు వలసలకు కారణం టీడీపీ, కాంగ్రెస్‌లేనన్నారు. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజ్టెలుగా మార్చారని విమర్శించారు. ఆ పెండింగ్‌ ప్రాజెక్టులను కేసీఆర్‌ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని చెప్పారు. పాలమూరును పచ్చబడేలా చేసింది కేసీఆరేనని స్పష్టం చేశారు. పాలమూరుకు మళ్లీ వలసలు తిరిగొచ్చాయన్నారు. 2014కు ముందు పాలమూరు ఎలా ఉండేది.. ఇప్పడెలా ఉందని ప్రశ్నించారు. పాలమూరును ఆనాడు చంద్రబాబు దత్తత తీసుకున్నారని, పదేండ్లు అధికారంలో ఉన్నా చంద్రబాబు పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరు కరువుతో కాంగ్రెస్‌, టీడీపీలు రాజకీయాలు చేశాయని విమర్శించారు. తాము పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు సాధించామని, కాలువలు తవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

పోతిరెడ్డిపాడు నుంచి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నీళ్లు తీసుకెళ్తుంటే రేవంత్‌ మాట్లాడలేదని విమర్శించారు. నాడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని ఆరోపించారు. 30 ఏండ్లలో కల్వకుర్తి ఆయకట్టు కిద 13 వేల ఎకరాలకు నీళ్లిచ్చారని, బీఆర్‌ఎస్‌ హయాంలో అదే కల్వకుర్తి కింది 3 లక్షల 7 వేల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. నెట్టంపాడు కింద ఆనాడు 2700 ఎకరాలకు నీరివ్వగా, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో తారు 6 లక్షల 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చామని తెలిపారు.కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో పాలమూరు నుంచి ప్రజలు వలసలు వెళ్లారని, కేసీఆర్‌ పాలనలో వలసలు వెళ్లిన ప్రజలు పాలమూరుకు తిరిగి వచ్చారని చెప్పారు. సాగు, తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను ముందుకు తీసుకెళ్లామన్నారు. ఉమ్మడి పాలనలో ఒక్క మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీ ఇవ్వలేదని, కానీ తాము పాలమూరు జిల్లాలో ఐదు మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌ దవాఖానలు ఇచ్చామని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి తన పౌరుషాన్ని పాలనలో చూపెట్టాలని ఎద్దేవాచేశారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని సూచించారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. కేసీఆర్‌ కిట్లు తెస్తే.. రేవంత్‌ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నారని విమర్శించారు. తన ఎత్తు గురించి కూడా రేవంత్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తాను కూడా ఆయన ఎత్తు గురించి మాట్లాడగలనని.. కానీ తనకు విలువలు ఉన్నాయని చెప్పారు. ఎవరెంత ఎత్తు ఉన్నారో ప్రజలకు అవసరం లేదని వెల్లడించారు.

Spread the love

Related News