హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి డాక్టర్ థియెరీ మాథ్యూ ఆయన బృందానికి ఎల్అండ్‌టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్) సాదర స్వాగతం పలికింది. బృందంలో ఫ్రాన్స్ కాన్సల్ జనరల్ థియెరీ బెర్తెలాట్, హైదరాబాద్‌లోని బ్యూరో డి ఫ్రాన్స్‌లో డిప్యుటీ కాన్సుల్ పాస్కల్ లోరో , రీజనల్ ఎకనమిక్ సర్వీస్ (దక్షిణ భారతదేశం) ఎకనమిక్ కౌన్సెలర్బ బెర్ట్రాండ్ డె లా ఫారెస్ట్ డివోన్‌లు తదితరులు ఉన్నారు. ఫ్రాన్స్ బృందానికి హెచ్ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి, ఎల్అండ్‌టీఎంఆర్‌హెచ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో కేవీబీ రెడ్డి, ఎల్అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చిప్లుంకర్‌తో పాటు కియోలిస్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌సీ మిశ్రా స్వాగతం పలికారు.
హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్)కి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఎల్అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్, కియోలిస్ హైదరాబాద్ ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ బహుముఖ పనితీరును వివరించాయి. పర్యటనలో భాగంగా హెచ్ఎంఆర్ యొక్క అధునాతన ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)ని అంబాసిడర్ మరియు ఆయన బృందం సందర్శించింది. మొత్తం నెట్‌వర్క్‌కి సంబంధించి రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల భద్రత, రియల్ టైమ్ సిస్టమ్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలన్నింటి నిర్వహణకు ఇది సెంట్రల్ హబ్‌గా వ్యవహరిస్తుంది.
హెచ్ఎంఆర్ పనితీరుకు సంబంధించి వివిధ అంశాలను తెలుసుకునేందుకు ఈ సందర్శన తోడ్పడింది. “పట్టణ ప్రాంత రవాణా విభాగంలో వినూత్నత, సాంకేతిక పురోగతికి నిదర్శనమైన హెచ్ఎంఆర్ రైల్వే వ్యవస్థ ఎంతగానో ఆకట్టుకుంది” అని శ్రీయుత థియెరీ మాథ్యూ తెలిపారు. “భవిష్యత్తులో కలిసి పని చేసేందుకు, సుస్థిరమైన అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు, పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు మాథ్యూ బృందం యొక్క సందర్శన దోహదపడగలదు” అని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. “హెచ్ఎంఆర్ కంట్రోల్ సెంటర్ యొక్క సాంకేతిక సామర్ధ్యాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోందనడానికి ఈ సందర్శన నిదర్శనంగా నిలవగలదు. పరస్పర సహకారంతో కలిసి పని చేసేందుకు ఇలాంటి పర్యటనలు తోడ్పడగలవు” అని ఎల్అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ&సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు.