ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు చేయనున్నారు. గతంలో స్కీం రద్దు చేస్తామని చెప్పిన భట్టి విక్రమార్క మాటలు ఏమయ్యాయంటూ నిలదీసింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు వసూలు చేస్తోందని ఆరోపించింది. అన్ని నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఇవాళ ధర్నా కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలు ఇచ్చి, ఆ పార్టీ ప్రజలను గందరగోళం చేసిందని విమర్శించారు.