తెలంగాణను ప్రపంచానికి గేట్‌వేగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 02, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్రాన్ని ప్రపంచానికి గేట్‌వేగా నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రజలంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదరిక నిర్మూలన, సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని CURE, PURE, RARE విభాగాలుగా అభివృద్ధి చేసే ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని వెల్లడించారు.

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు, రెండున్నరేళ్లలో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.56 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

మహిళల సాధికారత కోసం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలను ఆర్థిక శక్తి కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

యువతకు ఇచ్చిన హామీ మేరకు 67,763 ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని, నియామక ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ప్రీ-ప్రైమరీ తరగతుల విస్తరణ, బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు వంటి చర్యలను వివరించారు.

పేదల సొంతింటి కల సాకారం కోసం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇప్పటికే లక్ష ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. సెప్టెంబర్ 17 నాటికి మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి సేవల కేంద్రంగా అభివృద్ధి చేస్తూ, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, చెరువుల సంరక్షణ వంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

“జై హింద్.. జై తెలంగాణ” అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

Spread the love

Related News

Latest News