ప్రతిపక్షం, జూలై 13: ‘కల్కి’ సినిమాలో కర్ణుడి పాత్రను గొప్పగా చూపించారంటూ వస్తున్న విమర్శలకు దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. మహాభారతంలోని ద్రోణ వధ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన అంశాలనే సినిమాలో ప్రస్తావించానని ఆయన తెలిపారు. మహాభారతాన్ని పూర్తిగా చదవాలని, కర్ణుడి గొప్పతనం గురించి శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు ప్రస్తావించారో పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా వివేక్ దేబ్రాయ్ అనువదించిన మహాభారతాన్ని చదవాలని చెప్పారు. భారతీయ ఇతిహాసాలపై తనకు అపార గౌరవం ఉందని, తాను ఏమి చేస్తున్నానో పూర్తి అవగాహనతోనే సినిమా తెరకెక్కించానని స్పష్టం చేశారు. కథకు సంబంధించిన పూర్తి వివరణ రెండో భాగంలో తెలుస్తుందని, అప్పటివరకు వేచి చూడాలని ప్రేక్షకులను కోరారు.

















