ప్రతిపక్షం, జూలై 11: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్ రావు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆ పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం.. ఈ అంశంపై హరీశ్ రావుకు బహిరంగ సవాల్ విసిరారు.
“బీజేపీ నాయకులతో మాట్లాడలేదని భద్రాద్రి శ్రీరాముడిపై లేదా మీ మామ కేసీఆర్‌పై ప్రమాణం చేసి చెప్పగలవా?” అంటూ సీఎం ప్రశ్నించారు. హరీశ్ రావు రాజకీయ వైఖరిపై కేసీఆర్‌కే గతంలో అనుమానాలు ఉండేవని, అందుకే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు ఏడాది పాటు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.
అలాగే, కన్నెపల్లి ప్రాజెక్టు వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీశ్ రావును ఎందుకు తీసుకెళ్లలేదని కూడా సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయని, ఆ పార్టీ నాయకుల మధ్య నమ్మకం లేదనే విషయాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు కాలం చెల్లిందని, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని, అదే ప్రజల విశ్వాసాన్ని గెలిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
















