యువతే దేశానికి అసలైన సంపద.. క్రీడలకు ప్రోత్సాహమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 09: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువశక్తే భారతదేశానికి అతిపెద్ద సంపద అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రీడల్లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాల క్రీడా విధానాలే ప్రధాన కారణమని విమర్శించారు.

క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ, ప్రతిభకు అవకాశాలు కల్పిస్తే భారత యువత ప్రపంచ స్థాయిలో సత్తా చాటగలదని అన్నారు. సరైన మౌలిక వసతులు, శిక్షణ, ప్రోత్సాహం లేకపోవడం వల్ల అనేక మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ముందుకు రాలేకపోతున్నారని పేర్కొన్నారు.

భారత అథ్లెటిక్స్ దిగ్గజం పి.టి. ఉష, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ వంటి క్రీడాకారులు దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సీఎం కొనియాడారు. వారు తమ కృషి, పట్టుదలతో ప్రపంచ వేదికపై భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చారని, అలాంటి మరెందరో క్రీడాకారులు తయారవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులు కల్పించేందుకు సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా ఈ విధానం రూపొందించామని వివరించారు.

రాష్ట్రంలోని యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. క్రీడల అభివృద్ధి ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంతో పాటు దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News