తెలంగాణ విద్యలో కొత్త అధ్యాయం.. సీఎం చేతుల మీదుగా టీపీఎస్ ప్రారంభం

ప్రతిపక్షం, జూన్ 17: ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుట్లలో ప్రారంభించనున్నారు. అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ పాఠశాల రాష్ట్ర విద్యారంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, క్రీడా మైదానాలు, ఉచిత బస్సు సౌకర్యం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ వంటి సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 1,814 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలకు తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిన ప్రభుత్వం, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ విద్యను ప్రపంచస్థాయికి చేర్చే దిశగా టీపీఎస్ ఒక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Spread the love

Related News

Latest News