హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణలో గత మూడు నాలుగు రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో చాలా జిల్లాల్లో పంట నష్టం వాటిల్లుతోంది. కోతకు వచ్చిన పంటలు నేలరాలిపోతున్నాయి. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రైతులను ఆదుకోవాలని ట్వీట్ చేశారు.ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడొద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు.
ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని వ్యాపారులకు సూచించారు. రైతులను మోసం చేసి కనీస మద్దతు ధర ఇవ్వకుంటే రైస్ మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు చెప్పినా తీరుమారని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే రైతుల నుండి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగితే సహించేదే లేదని మంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ దగ్గర మోకరిల్లి కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి ధారాదత్తం చేసిందని ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ నాశనం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు.