Trending Now

నీచమైన భాషకు ఆద్యుడు కేసీఆర్ కాదా..!

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఒక్క పన్ను పాడైతే అన్ని పీకేసుకుంటామా? ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారని, మంగళవారం కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కేసిఆర్ చెప్పినట్లుగా పాడైంది పన్ను అయితే బాగుండేదని కానీ వెన్నముక పాడైందని మండిపడ్డారు. కేసిఆర్ అవినీతికి బలైంది కాళేశ్వరానికి వెన్నెముకలాంటి మేడిగడ్డ, మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ కూడా అంతే ముఖ్యం అని వివరించారు.

మనిషి శరీరంలో కాళ్లు, చేతులు, ముక్కు, మొఖం ఇలా అన్ని బాగానే ఉన్నా వెన్నెముక విరిగిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి కూడా అలాగే ఉంది, మేడిగడ్డ తర్వాత అన్నారం సుందిళ్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. కెసిఆర్ అవినీతి జబ్బు ఒక మేడిగడ్డకే పరిమితం కాలేదని ఆ జబ్బు అన్నారం సుందిళ్ళకు కూడా పాకిందని అన్నారు. తానే ఇంజనీర్, తానే డిజైనర్, తానే తాపీ మేస్త్రి అనే విధంగా వ్యవహరించారని కాళేశ్వరం కెసిఆర్ అవినీతి అహంకారానికి మూర్ఖత్వానికి నిదర్శనం అని విమర్శించారు. ఎత్తిపోతల.. తిప్పిపోతల.. కాళేశ్వరం ప్రాజెక్ట్ వెన్నెముక అయిన మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 22 పిల్లర్లలో దాదాపు 7 పిల్లర్లు 3 ఫీట్ల మేరకు కుంగినవని సాక్షాత్తు NDSA, కేంద్ర ప్రభుత్వ జల వనరుల నిపుణులు, మన ప్రభుత్వ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులు…. మేధావులు….రైతు సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పత్రికల ఎడిటర్లు, జర్నలిస్ట్ లు ఇలా ప్రజలు అందరూ ఏకరువు పెడుతుంటే.. అపర మేధావి కేసీఆర్ సమస్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలు పాల్గొనకుండా పారిపోయిన పెద్దమనిషి 80వేల పుస్తకాలు చదివిన మేధావి కాళేశ్వరం రూపశిల్పి ఇప్పుడు టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతారంట అని ఎద్దేవా చేశారు. భూమి ఆకాశం ఉన్నన్నిరోజులు బీఆర్ఎస్ ఉంటుందని కేసిఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ టీఆర్ఎస్ స్థానంలో కెసిఆర్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని, దేశంలో గత్తెర లేప్త భూకంపం సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో పోటీ చేయలేక చేతులెత్తేయగా, ఉన్న రాష్ట్రంలో ప్రజలు కెసిఆర్ కుర్చీ మడత పెట్టారని, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కేసిఆర్ పాలనలో జరిగిన పాలనపరమైన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరువుకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా..? మా ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన ఏర్పడిందని, అప్పటికే వర్షాకాలం సీజన్ ముగిసిందనే విషయాన్ని కేసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు.

ప్రజలు అత్యాశకు పోయారని ప్రజాతీర్పును కేసీఆర్ చులకన చేస్తున్నారని, తనకు ఓటు వేసినంత కాలం ప్రజలు మంచివారు, వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం ప్రజలకు తెలివి లేదు మూర్ఖులు అన్నట్లుగా కేసిఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును ఆమోదిస్తున్నాము అని ఈరోజు వరకు కేసీఆర్ నోటినుండి వెలువడిందా..? ప్రజా తీర్పును ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడడం ఎంత వరకు సమంజసం..? కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను కాపీ చేసి 400కు సిలిండర్ ఇస్తానంటే కూడా కెసిఆర్ హామీలను ప్రజలు నమ్మలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష గురించి కేసీఆర్ మాట్లాడడం దయ్యాలు వేదాలను వల్లించినట్లే ఉంది. పీకడానికి , తోక మట్ట బొందలగడ్డ సన్యాసి రండ వంటి పదాలను అలవోకంగా వదిలేసింది కేసీఆర్ కాదా ? తెలంగాణ రాజకీయాల్లో నీచమైన భాష తిట్ల ప్రయోగాలకు కేసీఆర్ ఆద్యుడు అని విమర్శించారు.

Spread the love