17 students killed in Kenya school fire: ఆఫ్రికా దేశం కెన్యాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ హాస్టల్‌లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సెంట్రల్ కెన్యాలోని నైరీకౌంటీలోని హిల్ సైడ్ ఎండరాషా అకాడమీలో పిల్లలు నిద్రపోతుండగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.
ఈ హాస్టల్‌లో మొత్తం 800 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా 12 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు కావడంతో గాయాలకు అల్లాడిపోతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. అయితే మరణించిన పిల్లలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.