Trending Now

నా ప్రతీ కష్టంలో అండగా ఉన్న కొడంగల్..

ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

త్వరలోనే రానున్న సిమెంట్​ పరిశ్రమలు

గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలె

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: నా రాజకీయ ఎదుగుదలతో పాటు నా ప్రతి కష్టంలో కొడంగల్​ ప్రజలు కొండంత అండగా ఉన్నారని, వారి రుణం తీసుకునేందుకు నాకు వచ్చిన అవకాశంతో అన్ని రంగాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, అందుకు ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కోరారు. గురువారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​సందర్భంగా కొడంగల్​ఎంపీపీ కార్యాలయంలో రేవంత్​రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన నివాసానికి తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారని, నా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్నారు.

త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా.. గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని దుయ్యబట్టారు. పరిశ్రమలు ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతంలో భూముల విలువలు పెరుగుతాయని, మన ప్రాంతానికి ఫార్మా కంపెనీలు వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పరిశ్రమలు ఏర్పాటుకు భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుందన్నారు.

ఇందుకుగాను భూసేకరణలో పట్టా భూములకు,అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతం నష్టపోతుందని, నేను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పై ఉంటుందని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటానని, మీకు మేలు జరగాలని.. ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయాలన్నదే నా ఆకాంక్ష అని అందుకోసం పనిచేస్తాన్నారు. నేను ఎంత పెద్ద నాయకుడినైనా కొడంగల్ నియోజకవర్గ ప్రజల్లో ఓ కుటుంబ సభ్యుడినేనని రేవంత్​ తెలిపారు.

లోక్​సభ ఎన్నికల్లో 50వేల మెజార్టీ ఇవ్వండీ..

మే 13న జరిగే లోక్ సభ ఎన్నికల్లో కొడంగల్ నియోనకవర్గం నుంచి 50 వేల మెజారిటీ కాంగ్రెస్​ అభ్యర్థికి ఇవ్వాలని, అందుకోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. మండల, బూత్, నియోజకవర్గ స్థాయిలో ఐదుగురు సభ్యుల చొప్పున సమన్వయ కమిటీ నియమించుకోవాలని సూచించారు. మళ్లీ నేను ఏప్రిల్ 8న ఇక్కడకు వస్తాని అప్పుడు మండలాల వారీగా సమన్వయ కమిటీలతో సమావేశమవుతానని, ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. అలాగే లోక్​సభ ఎన్నికల శంకారావాన్ని ఈ నెల 6న సాయంత్రం 5గంటలకు తుక్కుగూడలో పార్టీ జాతీయ నాయకులు పూరించబోతున్నారని, ఆ సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని సీఎం కోరారు.

Spread the love