Trending Now

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు పూర్తి.. సాయంత్రం ప్రకటన?

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల వడపోత పూర్తయ్యింది. సాయంత్రం లోగా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం సోనియా గాంధీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలన, అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముంబయిలో మొన్న రాత్రి సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించి పలు నియోజక వర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించిన మొదటి జాబితాలో రాష్ట్రానికి చెందిన జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబునగర్ లోకసభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన 13 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పై పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. 13 నియోజక వర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులపై కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఇప్పటికే ఫ్లాష్ సర్వేలు నిర్వహించింది. సర్వేల వివరాలు ముంబయిలో ఆదివారం రాత్రి జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించింది.

గెలుపు వీరులకే ఛాన్స్..

గెలుపే ప్రధానమన్న లక్ష్యంతో 13 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. సామాజిక సమతుల్యత పాటిస్తూనే విజయం సాదించ గలిగే ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు ఇచ్చే దిశలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం బలపరిచినట్లు సమాచారం. జనాదరణ కలిగిన నాయకులనే బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. సాయంత్రం ఏఐసీసీ ప్రకటించనున్న నాలుగో జాబితాలో తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికి ప్రకటించకపోతే బుధవారం అభ్యర్థుల వివరాలను అధిష్టానం వెల్లడించే అవకాశముందని సమాచారం.

అభ్యర్థుల తారు.. మారు..?

అప్పట్లో చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌లను రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం భావించింది. కాని మారిన, మారుతున్న రాజకీయ సమీకరణాలతో అభ్యర్ధుల విషయంలో పార్టీ నిర్ణయాలు మారుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరడంతో, పార్టీ సమీకరణాలు మారినట్లయింది. చేవెళ్ల నుంచి రంజిత్‌ రెడ్డిని పోటీలో నిలపడం, అక్కడ నుంచి పోటీ చేయించాలని యోచించిన సునీతా మహేందర్‌ రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్ల తెలుస్తోంది. మరొకవైపు సికింద్రాబాద్‌ లోకసభ స్థానం నుంచి మాజీ మేయర్‌ బొంతు రామ్మోన్‌ బదులు దానం నాగేందర్‌ను బరిలో దించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సిట్టింగ్‌ ఎంపీ, ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్యేని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రెండు లోకసభ స్థానాలకు అభ్యర్ధుల సర్దుబాటు జరిగిందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Spread the love