ప్రతిపక్షం, జూన్ 10: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పార్టీ విస్తరణ, స్వతంత్ర రాజకీయ బలం పెంపుపై దృష్టి సారించిన బీజేపీ, ఇకపై రాష్ట్రాల్లో మిత్రపక్షాలపై ఆధారపడకుండా అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుందని వెల్లడించారు.
మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడిన అమిత్ షా, తెలంగాణతో పాటు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా పార్టీ స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో బీజేపీని ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్న ఆయన, తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేసి ప్రజల్లో బీజేపీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని సూచించారు.
అదే సమయంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఏకరీతి పౌర స్మృతి అంశంపైనా అమిత్ షా స్పందించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దశలవారీగా ఏకరీతి పౌర స్మృతిని అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో ప్రతి పౌరుడికి ఒకే విధమైన చట్టాలు ఉండాలన్నదే తమ పార్టీ అభిప్రాయమని తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల అంశంపై అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుందనే దానిపై ఈ ప్రకటన స్పష్టత ఇచ్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి

















