Trending Now

ప్రణీత్​రావుకు హైకోర్టులో చుక్కెదురు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్​రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కిందికోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. పోలీసుల తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.నాగేశ్వరరావు వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ జి.రాధారాణి ఈ మేరకు తీర్పు వెలువరించారు. కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.నాగేశ్వరరావు హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తు అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. నిందితుడిని ఈ నెల 13న అరెస్ట్ చేసిన సమయంలో డీసీపీ ప్రెస్‌నోట్ మాత్రమే విడుదల చేశారని న్యాయస్థానానికి వివరించారు. పోలీస్‌స్టేషన్‌లో కనీస వసతలున్నాయని ఆయన ధర్మాసనానికి తెలియజేశారు.

వికారాబాద్​లో విచారణ..

హార్డ్​ డెస్క్​లను వికారాబాద్​ అనంతగిరి ఆదవిలో వేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో గురువారం ప్రణీత్​రావును వికారాబాద్​ తీసుకెళ్లి హార్డ్​ డెస్క్​లు ఎక్కడ వేశారో అన్న దానిపై‌‌ విచారణ చేశారు. ఫిర్యాదుదారైన ఏఎస్పీ రమేశ్ వాంగ్మూలం నమోదు సమయంలో తప్ప మిగతా సమయంలో పోలీస్‌స్టేషన్‌కు రావడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.నాగేశ్వరరావు హైకోర్టుకు వివరించారు. దర్యాప్తులో అతని పాత్ర ఏమీ లేదని చెప్పారు. ఏడు రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యాయని, మిగిలింది మూడు రోజులేనని న్యాయస్థానానికి తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పోలీసులు మిగతా మూడు రోజుల కస్టడీలో భాగంగా నిందితుడు ప్రణీత్‌రావును విచారించవచ్చని వెల్లడించింది.

మరోవైపు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్‌రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు అధికారి వేంకటగిరి ఆధ్వర్యంలో ఆధారాల ధ్వంసానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఐదో రోజు కస్టడీలో భాగంగా నిందితుడి నుంచి వీలైనంత మేర సమాచారం సేకరించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌ డీఎస్పీ కాల్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అటు రాజకీయాల్లోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా ప్రణీత్‌రావు పనిచేశారు. అప్పుడు ఎస్‌ఐబీ కార్యాలయంలోని రెండు గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్‌రావు అనధికారికంగా వాడుకున్నారు. వీటికి ప్రత్యేకంగా ఇంటర్నెట్‌ సదుపాయం పెట్టుకున్నారు. ఇటీవల వీటిల్లో కొన్ని రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రానిక్‌ డివైస్‌లలోని డేటా, ఇతర డాక్యుమెంట్లు మాయమైన్నట్లు పోలీసులు గుర్తించారు సమాచారమంతా తన వ్యక్తిగత పరికరాల్లోకి ప్రణీత్‌రావు కాపీ చేసుకొని హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. శాసనసభ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు గతేడాది డిసెంబర్‌ 4న రాత్రి సీసీటీవీ కెమెరాలను ఆఫ్‌ చేసి కీలక డేటాను ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు ప్రణీత్‌రావును అరెస్ట్‌ చేశారు.

Spread the love